Notification texts go here Contact Us Buy Now!

కేసీఆర్ అక్రమ ఆస్తులపై న్యాయ విచారణ జరపాలి : ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ

గత పాలకులు దోచుకున్న అక్రమ భూములను స్వాధీనం చేసుకుని తెలంగాణ ఉద్యమకారులకు పంచాలని ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం భూదందా

  • ధరణి పోర్టల్ అడ్డం పెట్టుకుని వేల కోట్లు కొల్లగొట్టారు
  • గత పాలకులు దోచిన భూములను ఉద్యమకారులకు పంచాలి
  • తెలంగాణ ఉద్యమకారుల వేదిక డిమాండ్.. 
  • హనుమకొండ బాలసముద్రంలో ఉద్యమ నాయకుల విలేకరుల సమావేశం

Prof-Kurapati-Venkatanarayana-Press-Meet-Hanamkonda-2026

హనుమకొండ, సెప్టెంబర్ 30 (న్యూస్‌పేజ్):

ఎందరో అమరవీరుల త్యాగాలు, వేలాది మంది పోరాటాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రాన్ని గత తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం, వారి బంధువులు కలిసి పూర్తిగా దోచుకున్నారని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పాలకులు చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న వేల ఎకరాల అక్రమ భూములను తక్షణమే స్వాధీనం చేసుకుని, రాష్ట్రంలోని నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ జిల్లా కేంద్రమైన బాలసముద్రంలోని ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ తన నివాసంలో ఉద్యమ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణను బంగారు రాష్ట్రంగా మారుస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అగ్రనేతలు, వారి కుటుంబ సభ్యులు లెక్కకు మించి ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ప్రొఫెసర్ వెంకటనారాయణ ఆరోపించారు. ఒక్కొక్కరు వేల కోట్ల విలువైన వందల ఎకరాల భూములను ఆక్రమించడమే కాకుండా, 10 ఎకరాల నుండి ఏకంగా 700 ఎకరాల విస్తీర్ణంలో కాకతీయుల కట్టడాలను తలపించేలా భారీ ప్రహరీలతో ఫామ్ హౌస్‌లు నిర్మించుకున్నారని విమర్శించారు. జిల్లాల్లో ఆనాటి మంత్రులు, ప్రజాప్రతినిధులు సామంత రాజుల్లా వ్యవహరిస్తూ పేదల అసైన్డ్ భూములను, ప్రభుత్వ స్థలాలను బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు.

అవినీతి తిమింగలాలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలి

ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు చిల్లా రాజేంద్ర ప్రసాద్, దారం జనార్ధన్, సాయిని నరేందర్, బొమ్మినేని పాపిరెడ్డి, దొమ్మాటి ప్రవీణ్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నందుకే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు ఘోర పరాజయాన్ని మిగిల్చారని, పార్లమెంట్ ఎన్నికల్లో గుండుసున్నా ఇచ్చారని గుర్తుచేశారు. కేసీఆర్ కుటుంబం, కొందరు మాజీ మంత్రులపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ ప్రారంభించడాన్ని వారు అభినందించారు. అయితే, ఈ విచారణ కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా, ఒక నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రస్తుతం ఈ విచారణ హైదరాబాద్ పరిసరాలు, సూర్యాపేట, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలకే పరిమితమైందని, దీనిని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ విస్తరించాలని డిమాండ్ చేశారు.

2014 నుండి 2023 నాటికి మాజీ నాయకుల ఆస్తులు 100 రెట్లు పెరిగాయని, క్షేత్రస్థాయిలో వారి అక్రమ సంపాదన ప్రజలకు కండ్లముందే కనిపిస్తోందని నాయకులు పేర్కొన్నారు. రాజకీయ నాయకులతో పాటు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, విద్యుత్, మెడికల్ శాఖల్లోని ఉన్నతాధికారులు కూడా ఈ దోపిడీలో భాగస్వాములయ్యారని ఆరోపించారు. ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని సాగించిన భూదందాలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, సర్ఫెఖాస్ భూముల ఆక్రమణలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి కమిటీతో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఉద్యమకారులకు కాంగ్రెస్ న్యాయం చేయాలి

తెలంగాణ కోసం ఆత్మత్యాగాలు చేసిన 1560 కుటుంబాలను గత పాలకులు పూర్తిగా విస్మరించి మొండిచేయి చూపారని, తొలి, మలిదశ పోరాటాల్లో సర్వం కోల్పోయిన ఉద్యమకారులకు కనీసం ఒక గుంట భూమి కూడా ఇవ్వకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకున్న భూములను ఉద్యమకారులకు పంపిణీ చేసి, వారి కుటుంబాలను గౌరవించాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. భవిష్యత్తులో ఏ పాలకుడూ ఇలాంటి సాహసం చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తేవాలని స్పష్టం చేశారు.




Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.
NextGen Digital Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...